ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై 27న మహా ధర్నా.అనుమతి కోసం జిల్లా కలెక్టర్, సహాయ పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం.
అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ వేదిక నాయకులు శనివారం జిల్లా కలెక్టర్, మంచిర్యాల సహాయ పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ వేదిక అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కె. వనజ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు, మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగుల అభీష్టం ప్రకారం ఈ నెల 27న మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నిర్వహించే మహా ధర్నాను అన్ని భాగస్వామ్య సంఘాలు శాంతియుతంగా నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఉద్యోగుల గొంతుక పత్రికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ వేదిక నాయకులు శ్రీనివాస్ దేశ్‌పాండే, అత్తె సుధాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, శ్రవణ్ కుమార్, గోపాల్ రాంకుమార్, తిరుపతి, నడిమెట్ల సత్యనారాయణ, ఎం.డి. యూసఫ్, రాజేందర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.